భారత్ క్రెడిట్ రేటింగ్ ను పెంచిన మూడీస్

“భారత సార్వభౌమ రేటింగ్ ను పెంచుతూ మూడిస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రధాని మోదీ నేతృత్వంలో పభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల వ్యాపార ఉత్పాదకత పెరుగుతోంది” అని మూడీస్ భావిస్తోంది. దేశ, విదేశీయ పెట్టుబడులు పెరిగి బలమైన వృద్ధి సాధ్యమవుతుందని అనుకుంటుంది. 2004 తరవాత భారత రేటింగ్ ను పెంచడం ఇదే తొలిసారి .

ప్రస్తుతమున్న దేశ క్రెడిట్‌ రేటింగ్‌ను బిఎఎ3 నుంచి బిఎఎ2కు సవరించింది. భారత ప్రభుత్వం మరిన్ని సంస్కరణలను వేగవంతం చేయాలని సూచించింది. దేశంలో నరేంద్ర మోదీ ఇప్పటి వరకు చేపట్టిన సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ పేర్కొంది. భారత రుణ పరపతిని అత్యల్ప పెట్టుబడి స్థాయి ‘బిఎఎ3’ నుంచి ‘బిఎఎ2’కు పెంచింది. అటల్‌ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మూడీస్‌ భారత్‌కు బిఎఎ3 రేటింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత మార్చడం ఇదే తొలిసారి. అవుట్‌లుక్‌ ఇండియా రేటింగ్‌ను కూడా సానుకూలం నుంచి స్థిరత్వానికి సవరించింది. 2017-18లో భారత వృద్ధిరేటు 6.7 శాతంగా ఉండొచ్చని భావిస్తుంది. మూడీస్‌ ప్రకటనతో శుక్రవారం భారత మార్కెట్లు పరుగులు పెట్టాయి. క్రెడిట్‌ రేటింగ్స్‌ పెరుగుదల వల్ల ముఖ్యంగా ప్రభుత్వ, కార్పొరేట్‌ కంపెనీలు విదేశాల నుంచి సులభంగా అప్పులు పొందడానికి వీలుంటుంది. దేశ ద్రవ్య, ఆర్థిక, నియంత్రణ విధానాలకు ఈ రేటును గీటురాయిగా తీసుకుంటారు. తద్వారా ప్రభుత్వాలు, కార్పొరేట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువ పెట్టుబడులను సమీకరించడానికి వీలుంటుంది. ఈ రేటింగ్‌ల వల్ల అధిక అప్పులు పొందడానికి వీలు ఉండటంతో, దేశం ఆర్ధిక ఒత్తిడిలోకి జారుకునే ప్రమాదం లేకపోలేదు. ఈ భారం అంతిమంగా ప్రజలపైనే పడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌లో కీలకమైన సంస్కరణలు ఇంకా రూపకల్పనలోనే ఉన్నాయని మూడీస్‌ పేర్కొంది. వీటిని వేగవంతం చేయాలని సూచించింది. ఇప్పటి వరకు చేపట్టిన సంస్కరణల వల్ల వ్యాపార వాతావరణం, ఉత్పాదకత మెరుగుపడుతుందని పేర్కొంది. దేశ, విదేశీయ పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేసింది. అందుకు దేశం స్థిరమైన వృద్ధి రేటు వైపు ముందుకు వెళ్తుందని పేర్కొంది. అంతర్జాతీయంగా మూడీస్‌, స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పి), ఫిచ్‌ రేటింగ్స్‌ సంస్థలు ప్రపంచ దేశాలకు రేటింగ్‌లను ఇస్తుంటాయి. దేశంలో వాణిజ్య పరంగా క్రిసిల్‌, కేర్‌, ఇక్రా తదితర సంస్థలు పరపతిని ప్రకటిస్తుంటాయి. మూడీస్‌ తరహాలోనే ఇతర సంస్థలు కూడా భారత పరపతిని పెంచకపోవచ్చని డిబిఎస్‌ ఎకనామిస్టు రాధిక రావు పేర్కొన్నారు. సంస్కరణల అమలులో జాప్యం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో స్తబ్దత, పెట్టుబడుల్లో మాంద్యం, బలహీనమైన వృద్ధి రేటు, చమురు ధరల పెరుగుదల తదితర పరిణామాల నేపథ్యంలో ఇతర సంస్థలు ఈ తరహా నిర్ణయం తీసుకోకపోవచ్చన్నారు. మరో రెండు అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు ఫిచ్‌, ఎస్‌అండ్‌పి ఈ అంశంలో అంత తొందరగా నిర్ణయం ప్రకటించకపోవచ్చన్నారు. వీటిపై  బ్యాంకులకు చెందిన అధికారులు తమ భావాలను వ్యక్తం చేశారు … ఇటీవల అమలు చేసిన జి‌ఎస్‌టి ,పరపతి విధాన వ్యవస్థలో మార్పులు, మొండి బకాయిలను ప్రక్షాళన చేయడానికి తీసుకున్ననిర్ణయాలు రేటింగ్ పెంపునకు దోహదం చేశాయని మూడీస్ వ్యాఖ్యానించింది. దీనిపై వివిద శాఖ మంత్రులు తమ భావాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలకు ఆలస్యంగా గుర్తింపు లభించిందని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అయితే రిలయన్స్ కమ్యూనికేషన్ క్రెడిట్ రేటింగ్ ను విత్ డ్రా  చేసుకుంటున్నట్టు మూడీస్ శుక్రవారం ప్రకటించింది . తమ బ్రాండ్లపై వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ఈ టెలికాం ఆపరేటర్ డిఫాల్ట్ అయిందనే కారణంతో మూడీస్ క్రెడిట్ రేటింగ్ ను విత్ డ్రా చేసింది .

 

మామాట:- ‘మూడీస్’ తో ‘మోడీ’ ప్రత్యెక ఒప్పందాన్ని ఏదో కుదుర్చుకున్నాడని, ఇదంతా డొల్ల సమాచారమని అప్పుడే చెవి కొరుకుడులు ప్రారంభమయ్యాయి. దీనికి సమాధానం ఆర్థికవేత్తలే చెప్పాల్సి ఉంటుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *