నగదు ఎక్కడికి పోతోందంటే…

హైదరాబాద్:

వేల కోట్ల రూపాయలు ఆర్‌బీఐ పంపిస్తోంది.. అయితే ఏటీఎంలలో ఎప్పుడూ డబ్బుండదు.. బ్యాంకులేమో మా వద్ద లేదు.. అంతా డ్రా చేసేసుకుంటున్నారు అని చెబుతున్నాయి. అయితే నగదు మొత్తం ఏమైనట్టు.. ఇదే ప్రశ్న ఇపుడు రాష్ట్రంలో ఉత్పన్నమవుతోంది.

కోట్ల రూపాయల నగదు నిల్వలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద మగ్గుతోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహించిన విచారణలో ఈ విషయం వెల్లడైంది. అసలు అంత డబ్బు వారివద్దకు ఎలా వెళ్లిందో తెలుసుకుందామని అధికారులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు.

రియల్టర్ల అవతారంలో అధికారులు

కొద్దినెలలుగా బ్యాంకుల్లో జమ కావాల్సిన డబ్బంతా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా వెళ్తోందని గుర్తించిన అధికారులు.. కస్టమర్ల అవతారమెత్తారు. భూములు కొంటామంటూ పలు రియల్ ఎస్టేట్ కార్యాలయాలకు స్వయంగా తిరిగారు ఇన్కమ్ టాక్స్ అధికారులు.

అక్కడ వాళ్లు చెప్పే నిబంధనలు, షరతులు అన్నీ కూలంకషంగా విన్నారు. అచ్చం కస్టమర్ల మాదిరిగానే రియల్ వ్యాపారులను నమ్మించారు. ఖరీదైన భూములను విక్రయించే క్రమంలో డబ్బులను ఎలా వెనకేసుకుంటున్నారో తెలుసుకున్నారు.

వినియోగదారుడికి నచ్చిన, విలువైన స్థలానికి సంబంధించిన లావాదేవీలు ఎలా సాగిస్తున్నారో ఆధారాలతో సహా సేకరించారు. సంబంధిత భూములకు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రిజిస్ట్రేషన్ ధర చెల్లించి, మార్కెట్ విలువకు సరిపడా మిగతా డబ్బులను నగదు రూపంలో ఇస్తే భారీగా డిస్కౌంట్లు ఇస్తామని రియల్ స్టేట్ వ్యాపారులు ఎర వేస్తున్నారు.

దీంతో ఎక్కువ మంది భూములు కావాల్సిన వాళ్లు బ్యాంకుల్లోని తమ అకౌంట్లలో ఉన్న డబ్బులు తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హార్డ్ క్యాష్‌గా అందజేస్తున్నారు. తద్వారా మార్కెట్ ధరలో కొంత తగ్గింపు పొందుతున్నారు.

రెండు సోదాల్లోనే 5.5 కోట్లు..  

ఈ క్రమంలోనే.. ఆధారాలను పక్కాగా సేకరించిన ఐటీ అధికారులు హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్‌లోని భాష్యం రియల్ ఎస్టేట్‌లో సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రూ.2.20 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

అలాగే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని గిరిధారి రియల్ స్టేట్స్ సంస్థలోనూ తనిఖీలు చేసిన ఇన్కమ్ టాక్స్ అధికారులు రూ.3.3 కోట్ల రూపాయల హార్డ్ క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. పలు రికార్డులను సీజ్ చేశారు.

మొత్తం నాలుగు గ్రూపులుగా విడిపోయిన ఐటీ అధికారులు రెండు సంస్థల్లోని కార్యాలయాలు, ఆ సంస్థలకు సంబంధించిన యజమానులు, ముఖ్యుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఇప్పటిదాకా రెండు సంస్థల్లోనే రూ.5.5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, తనిఖీలు పూర్తయితే ఇంకా భారీగా నగదును స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఐటీ అధికారులు చెబుతున్నారు..

గత కొద్దినెలలుగా ఖాళీ స్థలాలు, ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఖరీదైన ప్రాంతాల్లో ప్రభుత్వ ధరలకు భూములను కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలను, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆన్లైన్లో కాకుండా నగదు రూపంలో డబ్బులు చెల్లించిన వాళ్ల వివరాలను సేకరిస్తున్నారు. దీని కోసం రియల్ ఎస్టేట్ కంపెనీల్లోని రికార్డులను పరిశీలిస్తున్నారు. వాటితో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలాల వివరాలతో పోల్చి చూస్తున్నారు.

ఇలా.. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు…

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారిగా తీవ్ర నగదు కొరత ఏర్పడటం, బ్యాంకుల్లో రోజువారీగా జమ కావాల్సిన డబ్బులు కాకపోవడంతో ఐటీ అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. నిత్యం కోట్ల రూపాయల లావాదేవీలు జరగాల్సిన బ్యాంకుల్లో లక్షలకు పడిపోవడం కూడా ఈ రహస్య ఆపరేషన్‌కు ప్రధాన కారణమైంది.

మరోవైపు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే తెలుగు రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో పంపిస్తున్న డబ్బులు తిరిగి బ్యాంకులకు రాకుండా మాయమవుతున్నాయని ప్రస్తావించడం కూడా ప్రస్తుత పరిస్థితికి, నగదు కొరతకు నిదర్శనంగా నిలిచింది. ఐటీ అధికారుల డెకాయ్ ఆపరేషన్‌కు దారితీసింది.

హైదరాబాద్‌తో పాటు.. దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఆపరేషన్ చేపట్టారు. కర్ణాటకలోని మైసూరు, బెంగళూరుతో పాటు పంజాబ్‌లోనూ సోదాలు నిర్వహించారు. కర్ణాటకలోని 12 మంది పీడబ్ల్యూడీ కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. పంజాబ్‌లోని ఖన్నా జిల్లాలో పశువుల దాణా అమ్ముతున్నవారి దగ్గర కూడా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని లాకర్లను గుర్తించారు. లెక్కల్లో చూపని రూ.14.48 కోట్ల నగదు, నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా రూ.500, రూ.2000 నోట్లే ఉన్నాయి.

మామాట: నోట్ల రద్దుతో నల్ల డబ్బు మాయం అవ్వలేదేంటి మోడీ గారు… ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *